Drunk Driving: మందు బాబులపైనే తొలి కత్తి... మిగతా ఉల్లంఘనలపై ఇంకాస్త సమయం!
- ప్రభుత్వ నిర్ణయం తరువాతే కొత్త నిబంధనలు
- పక్క రాష్ట్రాల్లో అమలును పరిశీలించాలని భావిస్తున్న అధికారులు
- వ్యతిరేకత రాకుండా వ్యవహరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం
కొత్త వాహన నిబంధనలు నేటి నుంచి అమలులోకి రాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ మందు బాబులు మినహా మిగతా ఉల్లంఘటలపై పాత జరిమానాల విధానాన్నే అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టం-2019 అమలులోకి రాగా, తుది నిర్ణయాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పగించిన సంగతి తెలిసిందే. పలు రకాల ఉల్లంఘనల్లో జరిమానాలను పది రెట్ల వరకూ పెంచారు.
ఉదాహరణకు ఓవర్ లోడ్ తో ప్రయాణించే వాహనాలకు గతంలో రూ. 2 వేల జరిమానా ఉండగా, ఇప్పుడది రూ. 20 వేలకు పెరిగింది. ఇదే సమయంలో అదనంగా తీసుకెళుతున్న బరువుపైనా జరిమానా ఉంటుంది. ఇది చిన్న రవాణా వాహనాలపై పెను భారాన్ని మోపే అవకాశం ఉండటంతో వాటిని కొంత తగ్గించాలన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు రవాణా శాఖ అధికారులు అంటున్నారు. అయితే, నిర్ణయం తీసుకునే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులు, పెంచిన రుసుమును ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కేసుల నమోదు యథాతథమేనని, సీటు బెల్ట్, హెల్మెట్ వంటి ఉల్లంఘనలపై కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే ప్రస్తుతం రూ. 100 జరిమానా ఉండగా, దాన్ని రూ. 1000కి పెంచగా, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ రూ. 100నే వసూలు చేస్తామని అన్నారు.
ఇక మద్యం తాగి వాహనం నడిపేవారిపై మాత్రం తక్షణమే కొత్త నిబంధనలు వర్తిస్తాయని, రూ. 10 వేలు జరిమానా కట్టాల్సిందేనని, వాహనాలు నడిపే మైనర్లపైనా కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ డీసీపీ (ట్రాఫిక్ విభాగం) ఎస్ విజయకుమార్ వెల్లడించారు. తీవ్రమైన కేసుల విషయంలో కోర్టుల్లో అభియోగ పత్రాలను సమర్పిస్తామని స్పష్టం చేశారు.