Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు ఏడు రోజుల వరుస సెలవులు!
- నేటి నుంచి సచివాలయ పరీక్షలు
- గ్రామ వార్డు పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
- సెలవులు ప్రకటించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ పరీక్షలకు రంగం సిద్ధం కాగా, పరీక్షా కేంద్రాలున్న విద్యా సంస్థలకు, పరీక్షల డ్యూటీకి నియమితులైన ఉపాధ్యాయులులు పనిచేస్తున్న స్కూళ్లకు అనూహ్యంగా ఏడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. నేటి నుంచి 8వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే.
దీంతో 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో స్థానిక సెలవులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈనెల 22న ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు ప్రారంభమయ్యే ఒకరోజు ముందు... అంటే శనివారం కూడా సెలవు ప్రకటించారు. దీంతో వినాయక చవితి సందర్భంగా ఎన్నడూ లేనన్ని సెలవులు వచ్చినట్లయింది. కాగా, ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లనూ పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు.