Jagan: ప్రతి ఒక్కరు ఓ అశోకుడు కావాలి: జగన్
- ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి
- మనం నాటే ప్రతి మొక్క భావి తరాలకు ఉపయోగపడుతుంది
- అడవులను నరకడం వల్ల భూతాపం పెరిగింది
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఓ అశోకుడు కావాలని... తప్పకుండా చెట్లు నాటాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. మనం నాటే ప్రతి మొక్క భావి తరాలకు ఫలాలను అందిస్తుందని, ప్రాణ వాయువును అందిస్తుందని చెప్పారు.
'అశోకుడు దారికి ఇరువైపులా చెట్లు నాటించెను' అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామని... ఆయన నాటించిన చెట్లు ఆ తర్వాతి తరాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. అడవులను నరికేయడం వల్ల భూతాపం పెరిగిందని, ఫలితంగా మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో 23 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని... దీన్ని 33 శాతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. గుంటూరు జిల్లాలోని డోకిపర్రులో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.