cricket: బస్సు ఫెయిల్... న్యూజిలాండ్ క్రికెటర్లను అంబులెన్స్ లో స్టేడియానికి తరలించిన శ్రీలంక అధికారులు
- శ్రీలంకలో పర్యటిస్తున్న కివీస్ క్రికెటర్లు
- టూర్ గ్యాప్ లో క్యాండీ హిల్ స్టేషన్ కు వెళ్లిన ఆటగాళ్లు
- తిరుగు ప్రయాణంలో మొరాయించిన బస్సు
- క్లచ్ విరిగిపోవడంతో నిలిచిపోయిన వైనం
- అందుబాటులో ఉన్న అన్ని వాహనాలను సమకూర్చిన అధికారులు
శ్రీలంకలో న్యూజిలాండ్ క్రికెటర్లకు కొత్త అనుభవం ఎదురైంది. సాధారణంగా లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే ఆటగాళ్లు, అందుకు విరుద్ధంగా అంబులెన్సుల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇటీవలే టెస్టు సిరీస్ ముగించుకుని టి20 సిరీస్ కు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు 1 నుంచి శ్రీలంకతో కివీస్ 3 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కాస్త విరామం దొరకడంతో ప్రముఖ పర్యాటక స్థలం క్యాండీని సందర్శించాలని భావించారు. ఆ హిల్ స్టేషన్ అందాలు వీక్షించిన అనంతరం తిరిగి హోటల్ కు పయనమయ్యే క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ముందుకు కదలనని మొరాయించింది.
క్లచ్ విరిగిపోవడంతో బస్సు నిలిచిపోయింది. దాంతో, అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అన్నిరకాల వాహనాలను క్రికెటర్ల తరలింపునకు ఉపయోగించారు. వాటిలో కొన్ని అంబులెన్స్ లు కూడా ఉన్నాయి. ఆర్మీ వాహనాలు, ఇతర వాహనాలతో ఎలాగోలా హోటల్ కు చేరుకున్న న్యూజిలాండ్ క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు.