Andhra Pradesh: సెప్టెంబర్ 5 నుంచి పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తాం: ఏపీ మంత్రి తానేటి వనిత
- ఇసుక కొరతపై టీడీపీ నేతల ధర్నాపై వనిత ఆగ్రహం
- కొత్త ఇసుక పాలసీ వస్తుందని టీడీపీ డ్రామాలు తగదు
- వరదల కారణంగా ఇసుక తవ్వకం సాధ్యం కాలేదు
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ నేతలు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇప్పుడు ధర్నా చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీని భరించలేకే ఆ పార్టీని ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై టీడీపీ నేత చింతమనేని నాడు దాడి చేశారని, అలాంటి వ్యక్తి ఈరోజు ఇసుక కొరతపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పిన నాటి చంద్రబాబు సర్కార్, ఏ రోజు అయినా ప్రజలకు సరఫరా చేసిందా? అని ఆమె ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ వస్తుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని, సిమెంట్ కంపెనీలతో తమకు ఒప్పందం కుదరక ఇసుక కొరతను సృష్టించారన్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఇసుక తవ్వకం సాధ్యం కాలేదని, సెప్టెంబర్ 5 నుంచి పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.