Andhra Pradesh: నా కూతురికి వైద్యం చేయట్లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి: ఏపీ గవర్నర్ కు ఓ తల్లి వినతి!

  • స్వర్ణలత కూతురు జాహ్నవి
  • మానసిక వ్యాధితో బాధపడుతున్న జాహ్నవికి గైనిక్ సంబంధిత సమస్యలు
  • వైద్యం చేసేందుకు నిరాకరించిన మహిళా వైద్యురాలు 

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం కరువైంది. తన కుమార్తె కారుణ్య మరణం కోరుకుంటున్న ఓ తల్లి ఆవేదనే ఇందుకు నిదర్శనం. తన కుమార్తె కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు విజ్ఞప్తి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. స్వర్ణలత కూతురు జాహ్నవికి చిన్న వయసులోనే గైనిక్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. అంతేకాకుండా, ఆమె పదిహేనేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది.

ఈ నేపథ్యంలో వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో ఆమెను చేర్చారు. అయితే, జాహ్నవికి వైద్యం చేసేందుకు మహిళా వైద్యురాలు నిరాకరించారని, కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యురాలు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపించారు. తన కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేకనే కారుణ్య మరణానికి అనుమతించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసింది. తన కూతురుకి వైద్యం అందిస్తారా? లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, జాహ్నవి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే  ఆమె తండ్రి చిరుద్యోగిగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News