Andhra Pradesh: ప్రభుత్వం మీదేగా.. మరి, ఈ తొంభై రోజులు గాడిదలు కాశారా?: వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్
- రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం కరెక్టు కాదు
- టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తారా?
- ఇన్నిరోజులు ఏం చేశారు? దద్దమ్మలా? చేతకాని వాళ్లా?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో, టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, అమరావతిలో టీడీపీ నేతలకు భూములు ఉన్నాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సబబు కాదని, రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం కరెక్టు కాదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇందుకు సంబంధించిన రికార్డులు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఇన్నిరోజులు ఏం చేశారని ప్రశ్నించారు. దద్దమ్మలా? చేతకాని వాళ్లా? రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయిగా! ప్రభుత్వం వైసీపీదేగా, తొంభై రోజులు గాడిదలు కాశారా? అంటూ వైసీపీపై మండిపడ్డారు. తాము తప్పు చేస్తే కేసులు పెట్టాలే తప్ప, అవినీతి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. బంగారం లాంటి అమరావతి ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.