cm: ప్రాజెక్టులపై చంద్రబాబు గొడవపడి సాధించింది ‘గుండు సున్న’: సీఎం కేసీఆర్
- చంద్రబాబునాయుడిది సంకుచిత మనస్తత్వం
- బాబ్లీ, పరవాడ ప్రాజెక్టులపై నాడు బాబు గొడవ పడ్డారు
- హంగామా చేయడం తప్ప ఏం సాధించారు?
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఏదులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి ఆ నీటిని ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలు తీసుకోవాలని అనుకుంటున్నాయని, ఈ విషయమై ఏపీ సీఎం జగన్, తాను ఓ అభిప్రాయానికి వచ్చామని చెప్పారు.
అందుకు తగు రీతిలో ఒప్పందాలు చేసుకుని, సుహృద్భావ రీతిలో చర్చల ద్వారా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇక్కడ తెలివిలేని వాళ్లు కొంతమంది ఏం చేయలేక పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేయలేకపోయారని, అదే విధంగా మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు చాలా సంకుచిత ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు ఎలాంటి గుణమున్నదో ఇతరులకు కూడా అలాంటి గుణమే ఉందని ఆయన భావిస్తారని విమర్శించారు.
గతంలో బాబ్లీ ప్రాజెక్టు, పరవాడ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు గొడవ పడి సాధించింది ‘గుండు సున్న’ అని ఎద్దేవా చేశారు. ఎక్కడ ప్రాజెక్టు ఉంటే అక్కడ ‘బస్తీమే సవాల్’ అనడం, కోర్టుకు వెళ్లడం, హంగామా చేయడం తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదని వ్యాఖ్యానించారు.