Telangana: ఏడాది లోగా ‘పాలమూరు ఎత్తిపోతల’ను పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్
- ప్రతి 15 రోజులకోసారి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తా
- గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం గొప్ప నిర్ణయం
- పాలమూరు ఎత్తిపోతల పనులను పరిశీలించిన కేసీఆర్
ప్రగతి నిరోధక శక్తులు అడ్డుపడటం వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆలస్యమైందని, ఏడాది లోగా పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఏదులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎనిమిది నుంచి పది నెలల్లోగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి పదిహేను రోజులకొకసారి ప్రాజెక్టు నిర్మాణ పనులను సమీక్షిస్తామని అన్నారు.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించే యత్నాలు చేస్తున్నామని, తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ విషయమై ఏపీ సీఎం జగన్, అధికార బృందంతో చర్చలు జరుగుతున్నాయని, ఇవి త్వరలో ఓ కొలిక్కి వస్తాయని అన్నారు.కాగా, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో కీలక రిజర్వాయర్ అయిన కరివెన ప్రాజెక్ట్ ను, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్ పనులనూ కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కరివెన ప్రాజెక్టు ఏరియల్ వ్యూ నిర్వహించారు. అనంతరం ఇంజనీర్లు, అధికారులు, వర్క్ ఏజెన్సీలతో పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.