Telugudesam: అమరావతి రాజధానిగా ఉండటం జగన్ కు ఇష్టం లేదు: బుద్ధా వెంకన్న విమర్శలు

  • అమరావతిని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారు
  • రాజధాని మార్పుపై జగన్ తక్షణం స్పందించాలి
  • రైతులను జగన్ ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోంది

ఏపీ రాజధాని అమరావతిని మారుస్తున్నారన్న వార్తలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  రాజధానిగా అమరావతి ఉండటం సీఎం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు. అమరావతిని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని మార్పుపై వస్తున్న వదంతులు, ఆరోపణలు, విమర్శలపై జగన్ తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతుల గురించి బుద్ధా వెంకన్న ప్రస్తావించారు. రైతుల  జోలికి వెళ్లిన వారిని, వారికి అన్యాయం చేసిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని అన్నారు. రైతులను జగన్ ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే నాడు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చంద్రబాబు హయాంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

జగన్ మాత్రం కులాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలను చీల్చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలను గౌరవించాలని సూచించారు. అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News