lion: గడ్డి మేస్తున్న సింహం.. వీడియో వైరల్!
- గుజరాత్ అడవిలో అసాధారణ ఘటన
- సింహాల జీర్ణశక్తిలో ఇబ్బంది ఉంటే గడ్డి తింటాయన్న కన్జర్వేటర్
- తిన్న ఆహారాన్ని బయటకు పంపేందుకే ఇలా తింటాయని వివరణ
చాల్లే.. చెప్పొచ్చారు కానీ.. ఎంత ఆకలేస్తే మాత్రం సింహం గడ్డి తింటుందా? అది అసలే అడవికి రాజు. అంతగా తిండి దొరక్కపోతే ఆకలితో అలమటిస్తుంది కానీ గడ్డి తింటుందా? అని కొట్టిపారేయకండి. ఇది వాస్తవం.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా ఖంభా అటవీ ప్రాంతంలో ఓ సింహం ఇలా పచ్చ గడ్డి మేస్తూ కనిపించింది. గడ్డి మేస్తున్న సింహాన్ని చూసిన వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.
సింహాలు గడ్డి తినడం చాలా అరుదైన ఘటన అని షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ తెలిపారు. అయితే, వాటి కడపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు.