Pakistani Commandos: భారత్ లోకి చొరబడేందుకు పాక్ కమెండోల యత్నం.. గుజరాత్ లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్!

  • గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి ప్రవేశించిన పాక్ కమెండోలు
  • గుజరాత్ లోని కచ్ లోకి ప్రవేశించేందుకు యత్నం
  • సముద్ర తీర ప్రాంతంలో గస్తీ ముమ్మరం

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ రగిలిపోతోంది. ఈ అంశంలో ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు కూడా భారత్ కే మద్దతు పలకడంతో ఉడికిపోతోంది. ఏదో విధంగా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తోంది. సరిహద్దుల గుండా టెర్రరిస్టులను చొప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు మరో దుస్సాహసానికి పూనుకుంది. తమ కమెండోలను భారత భూభాగంలోకి చొప్పించేందుకు యత్నిస్తోంది. సముద్ర మార్గం గుండా కచ్ ఏరియాలోకి పాక్ కమెండోలు చొరబడేందుకు యత్నిస్తున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో, గుజరాత్ లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

ఈ క్రమంలో, అదానీ పోర్ట్స్ సెజ్ ఓ ప్రకటనను వెలువరించింది. గల్ఫ్ ఆఫ్ కచ్ లోకి పాకిస్థాన్ కమెండోలు ప్రవేశించారనే సమాచారం కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి తమకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. హరామీ నాలా జలాల గుండా వారు ప్రవేశించారని... అండర్ వాటర్ దాడుల్లో వారు శిక్షణ పొందారనే సమాచారం ఉందని వెల్లడించింది. ముంద్రా పోర్టులోని అన్ని నౌకల పట్ల కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది. నిఘాను ముమ్మరం చేయాలని సూచించినట్టు చెప్పింది.

మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులు, ఓడలను ట్రాకింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్ ను ముమ్మరం చేయడమే కాక, సమీపంలో ఉన్న కార్యాలయాలు, నివాసాల వద్ద ఉన్న వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.

Pakistani Commandos
Gujarath
Kutch
Gulf of Kutch
Adani Ports
  • Loading...

More Telugu News