East Godavari District: పురోహితుని వద్ద డబ్బే డబ్బు... చనిపోయాక బయటపడిన నగదు!
- ఇంట్లో మూటలతో గుట్టలుగుట్టలుగా సొమ్ము
- లెక్క తేలినవి రూ.6 లక్షల వరకు
- ఇంకా లెక్కించాల్సిన మూటలు ఎన్నో
పౌరోహిత్యం అంటే జీవన పోరాటమన్న భావనే అధికం. వృత్తిపరంగా వచ్చే ఆదాయం అంతంత కావడమే ఇందుకు కారణం. కానీ చనిపోయిన ఓ నిరుపేద పురోహితుడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా డబ్బు బయటపడడం చూపరులనే ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే...తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలోని ఓ పాడుపడిన ఇంటిలో అప్పల సుబహ్మ్రణ్యం (70) అనే పురోహితుడు ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. 30 ఏళ్లుగా చుట్టుపక్కల పౌరోహిత్యం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు.
అనారోగ్యంతో మంగళవారం ఇతను చనిపోయాడు. ఆయన బంధువులు, పిల్లలు ఊర్లోగాని, సమీప ప్రాంతాల్లోగాని అందుబాటులో లేకపోవడంతో స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహించారు. మరునాడు సుబ్రహ్మణ్యం ఉన్న పాడుపడిన ఇంట్లోకి స్థానికులు ప్రవేశించారు. వారికి పెద్ద పెద్ద మూటలు దర్శనం ఇవ్వడంతో ఏమిటా అని పరిశీలించి షాక్‌కు గురయ్యారు.
ఆ మూటల్లో పెద్ద మొత్తంలో నగదు ఉండడంతో ఆశ్చర్యపోయారు. మూటలు విప్పి లెక్కించడం మొదలు పెట్టారు. ఎంతకీ తరగక పోవడంతో కౌంటింగ్ మిషన్లు తెప్పించారు. రాత్రి తొమ్మిది గంటల వరకు లెక్కించగా రూ.6 లక్షలు నికరంగా తేలింది. ఇంకా మరికొన్ని మూటలు ఉండడంతో వాటిని కూడా లెక్కించాకే మొత్తం ఎంతన్నది తేలుతుంది!