Jammu And Kashmir: జైలుకెళ్లినోళ్లంతా గొప్ప నాయకులు అవుతారు: జమ్మూకశ్మీర్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
- నేనైతే 30 సార్లు జైలుకెళ్లా..
- నిర్బంధంలో ఉన్నామని బాధపడొద్దు
- ఎన్నికల్లో ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది
జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కువ రోజులు జైలులో గడిపి వస్తే వారే గొప్ప నాయకుడని పేర్కొన్నారు. తానైతే 30 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఎవరైతే జైలుకు వెళ్తారో వారే గొప్ప నాయకులు అవుతారని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో వివిధ పార్టీల నిర్బంధంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. నేతలను నిర్బంధించామని విచారం వద్దని, వారు ఎన్ని ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంటే అంత గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని, వారే గొప్ప నేతలు అవుతారని అన్నారు. తానైతే ఏకంగా ఆరు నెలలు నిర్బంధంలో ఉన్నానని గవర్నర్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370ని ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత గవర్నర్ మాలిక్ తొలిసారి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు ఇతర నేతల నిర్బంధం కొనసాగుతుండడంపై విలేకరులు ప్రశ్నించారు.
దీనికి గవర్నర్ బదులిస్తూ.. ‘‘వారు గొప్ప నేతలు అవడం ఇష్టం లేదా? నేను 30 సార్లు జైలుకు వెళ్లొచ్చా. ఎవరైతే జైలుకు వెళ్తారో, ఎవరైతే ఎక్కువ రోజులు జైలులో ఉంటారో వారు గొప్ప నేతలు అవతారు. ఎన్నికల సందర్భంలో ఇది వారికి బాగా కలిసొస్తుంది. నేనైతే ఆరు నెలలు జైలులో గడిపా’’ అని మాలిక్ పేర్కొన్నారు. కాబట్టి నిర్బంధంలో ఉన్నందుకు విచారం వద్దని హితవు పలికారు.