Jammu And Kashmir: కాసేపట్లో శ్రీనగర్ లో అడుగు పెట్టనున్న సీతారామ్‌ ఏచూరి!

  • రాష్ట్రంలో పర్యటించనున్న తొలి విపక్ష నాయకుడు
  • ఆయన పర్యటనకు నిన్న అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు
  • ఇప్పటి వరకు విపక్ష నేతలెవరినీ అనుమతించని ప్రభుత్వం

గత కొన్ని రోజులుగా ఆంక్షల అమలులో వున్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి కాసేపట్లో అడుగు పెట్టనున్నారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్న తొలి ప్రతిపక్ష నేత ఆయనే అవుతారు. ఆంక్షల నేపథ్యంలో అక్కడి పోలీసులు పలువురు నాయకులను కొన్నాళ్ల క్రితం గృహనిర్బంధం చేశారు. వీరిలో సీపీఎం నేత యూసఫ్ తరిగామి కూడా ఉన్నారు. ఆయన అనారోగ్యం బారిన పడడంతో ఇటీవల పరామర్శించేందుకు వెళ్లిన ఏచూరికి చుక్కెదురైంది.


ఇటీవల రెండుసార్లు ఆయన శ్రీనగర్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని వెనక్కి పంపారు.  దీంతో అనారోగ్యంతో ఉన్న తమ నేతను కలిసేందుకు అనుమతించాలని ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అందుకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనగర్ వెళ్లి తరిగామిని మాత్రమే కలవాలని, నిబంధనలు ఉల్లంఘించరాదని షరతులతో అనుమతినిచ్చింది. 


ఏచూరి నిబంధనలను అతిక్రమిస్తే నివేదిక ఇవ్వాలని పోలీసులను కూడా ఆదేశించింది. మొత్తమ్మీద కొన్ని షరతులతోనైనా కోర్టు శ్రీనగర్ కు వెళ్లేందుకు అనుమతించడంతో ఈరోజు ఉదయం సీతారామ్ ఏచూరి ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. కాసేపట్లో అక్కడ అడుగు పెట్టనున్నారు.

Jammu And Kashmir
CPM echuri
srinagar
  • Loading...

More Telugu News