kollywood: సేవా పన్ను కేసు: కోర్టుకు హాజరైన నటుడు విశాల్.. అరెస్ట్ వారెంట్ వెనక్కి!

  • కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
  • రూ. 4 కోట్ల టీడీఎస్ బకాయిలు
  • చెల్లిస్తారో? కేసును ఎదుర్కొంటారో తేల్చుకోవాలన్న కోర్టు

సేవా పన్ను కేసులో కోలీవుడ్ నటుడు విశాల్‌ బుధవారం చెన్నై, ఎగ్మూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు కావడంతో అతడిపై ఉన్న వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో విశాల్ సినీ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ నుంచి జరిగే చెల్లింపుల్లో టీడీఎస్ మినహాయించుకున్నప్పటికీ ఆ సొమ్మును ఆదాయ పన్ను శాఖకు నిర్ణీత సమయంలో చెల్లించడంలో విశాల్ విఫలమయ్యాడు. మొత్తం నాలుగు కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉండడంతో ఆదాయపు పన్ను శాఖ విశాల్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది.

అయినప్పటికీ విశాల్ నుంచి స్పందన లేకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎగ్మూరులోని ఆర్థిక నేరాలపై విచారణ జరిపే కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా విశాల్ నేరుగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణకు కూడా విశాల్ హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో బుధవారం విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. రెండు గంటలకు పైగా విశాల్ కోర్టులో వేచి ఉన్నాడు. దీంతో అతడిపై ఉన్న వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది. బకాయిలు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి కేసును ముగించుకుంటారా? లేక కేసు విచారణను కొనసాగిస్తారా? అనేది తేల్చుకుని వచ్చే నెల 12న తిరిగి కోర్టులో హాజరు కావాలని విశాల్‌ను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News