India: భారత భూభాగంలోని సైనికులు, ప్రజలను తికమక పెట్టేందుకు పాక్ కొత్త ఎత్తుగడ!
- ఎల్ ఓసీ వెంబడి ఎఫ్ ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటు
- ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టేందుకు నయా పన్నాగం
- పాక్ కమాండర్లకు రేడియో స్టేషన్ల ఏర్పాటు బాధ్యతల అప్పగింత
భారత్ ను అస్థిర పరిచేందుకు పాకిస్థాన్ ఎంతటి కుయుక్తులకు పాల్పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరో కొత్త పన్నాగానికి తెరలేపింది. నియంత్రణ రేఖ వెంబడి ఎఫ్ఎం రేడియో స్టేషన్లు నెలకొల్పాలని భావిస్తోంది. ఈ రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారమయ్యే కథనాలతో ఎల్ ఓసీ సమీపంలోని భారత సైనిక విభాగాలను, భారత ప్రజలను తికమక పెట్టాలన్నది పాక్ ప్రణాళిక. ఆ ప్రసారాలు భారత రేడియో స్టేషన్ల నుంచి వస్తున్నాయని భ్రమింపజేయడమే పాక్ ముఖ్యోద్దేశం.
ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడంలో ఈ మధ్య పాక్ దళాలకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దాంతో ఈ ఎఫ్ ఎం రేడియో స్టేషన్ల ఎత్తుగడకు పాక్ తెరదీసింది. ఎల్ ఓసీ వెంబడి ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసే బాధ్యతను పాక్ మిలిటరీ కమాండర్లకు అప్పగించారు. అంతేకాకుండా, పీఓకేలో ఉన్న రేడియో స్టేషన్లను కూడా సరిహద్దు వెంబడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.