Amaravathi: కొత్త రాజధాని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు...?
- రాజధాని తరలింపు ఆలోచనలో వైసీపీ సర్కారు అంటూ జీవీఎల్ వ్యాఖ్యలు
- మీడియా సమావేశం తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతూ కొత్త రాజధానిపై సూచనప్రాయ సంకేతాలు!
- ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న దొనకొండ పేరు!
రాష్ట్రంలో ఇప్పుడు రాజధాని మార్పు అంశమే ఎక్కువగా చర్చకు వస్తోంది. అమరావతిపై బొత్స రాజేసిన నిప్పుల కుంపటి ఆరడంలేదు. మంత్రులు కూడా వ్యాఖ్యలు చేస్తుండడం, ఇతర పరిణామాలు రాజధాని అమరావతిపై ఎవరికీ స్థిరమైన అభిప్రాయాన్ని కలిగించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు వైసీపీ సర్కారు సుముఖంగా ఉన్నట్టులేదని వ్యాఖ్యానించిన ఆయన, 'ఆఫ్ ద రికార్డ్' లో ప్రకాశం జిల్లాలో కొత్త రాజధాని ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపినట్టు సమాచారం.
మీడియా సమావేశం ముగిసిన తర్వాత సన్నిహితులైన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జీవీఎల్ ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో రాజధాని అంటే ఎప్పటినుంచో దొనకొండ పట్టణం రాజధాని పరిశీలన ప్రాంతాల జాబితాలో నలుగుతూ వస్తోంది. అమరావతి రాజధానిగా ప్రకటించకముందు దొనకొండ కూడా రేసులో నిలిచింది. దాంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి.