GVL: ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే పరిస్థితి కనిపించడంలేదు... ఇది స్పష్టం: జీవీఎల్
- ఏపీ రాజధాని అమరావతిపై అనిశ్చితి
- బొత్స వ్యాఖ్యలతో మొదలైన దుమారం
- స్పందించిన బీజేపీ నేత జీవీఎల్
గత కొన్నిరోజులుగా ఏపీ రాజధాని అమరావతి ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అమరావతిపై వివాదాన్ని రేకెత్తించాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విపక్ష టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
ఏపీ మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తుండడంతో అనిశ్చితి మరింత పెరుగుతోంది తప్ప, అది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ మంత్రులపై ఒత్తిళ్లు వస్తుండొచ్చేమోనని వ్యాఖ్యానించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాట ఆడకుండా తన విధానం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.