Modi: మోదీ నియోజకవర్గంలో భారీ విధ్వంసానికి స్కెచ్!
- వారణాసిలో పర్యటించిన ఇద్దరు ఉగ్రవాదులు
- పలువురితో భేటీ అయిన ముష్కరులు
- బేస్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాల పరిశీలన
ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ పైనే ఎక్కువ దృష్టి సారించిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు... కొత్త వ్యూహాలకు తెరతీశారు. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో కొత్త టార్గెట్లను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా ఇంటెలిజెన్స్ విభాగం అందించిన నివేదికలో ఈ అంశాలు వెలుగు చూశాయి. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తాయిబా స్కెచ్ వేసినట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది.
వారణాసిలో భారీ టెర్రర్ అటాక్ కు లష్కర్ ప్రణాళికలను రచిస్తోందని... ఇందులో భాగంగా అక్కడ ఓ బేస్ ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందని ఇంటెలిజెన్స్ తెలిపింది. మరోవైపు, కొన్ని నెలల క్రితమే లష్కరే తాయిబా ఉగ్రవాదులు వారణాసిలో పర్యటించారని... బేస్ ఏర్పాటు కోసం కొన్ని ప్రాంతాలను కూడా పరిశీలించారని వెల్లడించింది. పాక్ నుంచి వచ్చిన ఉమర్ మద్ని అనే ఉగ్రవాది... ఒక నేపాల్ బేస్డ్ టెర్రరిస్ట్ తో కలసి మే నెలలో వారణాసి వచ్చాడని... మే 7 నుంచి మే 11 వరకు ఓ రెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిపింది. ఈ సందర్భంగా, వారణాసిలోని పలువురిని వారు కలిశారని... లష్కరే తాయిబా నెట్ వర్క్ ను విస్తరించే అంశంపై సూచనలు ఇచ్చారని వెల్లడించింది. పవిత్ర కాశీ నగరంలో విధ్వంసం సృష్టించడంపై చర్చించారని తెలిపింది.