Swami Chinmayanand: కేంద్ర మాజీ మంత్రిపై ఆరోపణలు చేసిన లా విద్యార్థిని.. ఆ తర్వాత కనిపించకుండా పోయిన వైనం!
- కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లా విద్యార్థిని తీవ్ర ఆరోపణలు
- ఆదివారం నుంచి విద్యార్థిని ఆచూకీ గల్లంతు
- బీజేపీ నేతపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద్ తనను వేధిస్తున్నారని ఆరోపించిన విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఎస్ఎస్ లా కాలేజ్ డైరెక్టర్ అయిన చిన్మయానంద తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ లా విద్యార్థిని తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను ఆయన నాశనం చేస్తున్నారని ఆరోపించింది. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
విద్యార్థిని చేసిన ఆరోపణల వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె తానున్న కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. శనివారం నుంచి ఆమె ఫోన్ సిచ్చాఫ్‌లో ఉండగా ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తె అదృశ్యం కాలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ, చిన్మయానందపై ఫిర్యాదు చేశారు. ఆమె ఉన్న హాస్టల్ రూమును సీజ్ చేయాలని, దానివల్ల సాక్ష్యాధారాలు మార్చే వీలుండదని కోరారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా, విద్యార్థిని వైరల్ వీడియో గురించి తనకేమీ తెలియదని షాజహాన్ పూర్ ఎస్ఎస్‌పీ చిన్నప్ప తెలిపారు.