INX Media case: రేపటి వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయొద్దు.. ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం

  • చిదంబరం తరపున కోర్టులో వాదనలు వినిపించిన కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి
  • ప్రశ్నల లిఖిత పత్రాలను కోర్టులో సమర్పించాలంటూ కోర్టులో పిటిషన్
  • అది సాధ్యం కాదన్న సొలిసిటర్ జనరల్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరానికి స్వల్ప ఊరట లభించింది. రేపటి వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. ఈ కేసులో గతేడాది డిసెంబరు 19న, ఈ ఏడాది జనవరి 1, జనవరి 21న చిదంబరానికి సంధించిన ప్రశ్నల లిఖిత పత్రాలను తయారు చేయాల్సిందిగా ఈడీనీ ఆదేశించాలని కోరుతూ చిదంబరం తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో పిటిషన్ వేశారు.

దీంతో కల్పించుకున్న ఈడీ తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. చిదంబరం తాజా దరఖాస్తుకు తన వాదనల సమయంలోనే సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆ పత్రాలను కోర్టులో ఉంచలేమని తేల్చి చెప్పారు. దీంతో కల్పించుకున్న సిబల్.. ఈడీ యాదృచ్ఛికంగా పత్రాలను తయారుచేస్తోందని, అడిగితే కేసు డైరీలో భాగమని చెబుతున్నారని ఆరోపించారు. వారు పత్రాలను కోర్టులో పెట్టకుండా నిందితులను అదుపులోకి తీసుకోలేరని పేర్కొన్నారు.

చిదంబరం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను ప్రస్తావించారు. ఆర్టికల్ 21 (జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) కింద పౌరుల ప్రాథమిక హక్కును నిలిపివేయలేరని కోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ)ను 2009లో సవరించారని, ఈ కేసులో ఆరోపణలు 2007-2008 మధ్యలో చేశారని కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ఆరోపించిన నేరాలు లేనప్పుడు ఒక వ్యక్తిని కింగ్‌పిన్‌గా  చిత్రీకరించేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు. వాదోపవాదాలు విన్న సుప్రీం ధర్మాసనం మంగళవారం వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయవద్దని ఈడీని ఆదేశించింది.

  • Loading...

More Telugu News