KTR: గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవి: కేటీఆర్
- భాగ్యనగరంలో తాగునీటి సమస్య లేదన్న కేటీఆర్
- చెన్నై తరహా పరిస్థితి రాకుండా కేసీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు
- కృష్ణా, గోదావరి జలాలు వృథా కానివ్వకుండా ప్రాజెక్టులు కడుతున్నారంటూ వెల్లడి
హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో ఎండాకాలం వస్తే నీటి కోసం జలమండలి ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించే వారని, ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. నిజాంపేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలకు రెండ్రోజులకు ఓసారి నీళ్లు ఇవ్వగలుగుతున్నామని, గతంలో ఇక్కడ 14 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదని వివరించారు.
చెన్నైలో తాగునీటి సమస్య వస్తే రైళ్లలో మంచినీరు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కానీ, హైదరాబాద్ కు అలాంటి దుస్థితి ఏర్పడకుండా కేసీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాలను వృథా కానివ్వకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.