Kodela: మాజీ స్పీకర్ కోడెల కుమార్తెపై మరో కేసు!
- కోడెల కుమార్తెపై ఫిర్యాదు చేసిన ఖమ్మం జిల్లా వాసి
- సర్జికల్ కాటన్ కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టారంటూ ఆరోపణలు
- డబ్బులు అడిగితే దాడికి పాల్పడ్డారంటూ పేర్కొన్న బాధితుడు
ఎన్నికల తర్వాత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులపై పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా, కోడెల కుమార్తె విజయలక్ష్మిపై ఖమ్మం జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి అనే వ్యక్తి నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న తమ వెంకటేశ్వర సర్జికల్ కాటన్ మాన్యుఫ్యాక్చరర్స్ సంస్థ నుంచి విజయలక్ష్మి పెద్ద మొత్తంలో సర్జికల్ కాటన్ కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొట్టారని రవీంద్రారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముప్పాళ్ల మండలంలోని గోళ్లపాడులో ఉన్న సేఫ్ డ్రగ్ హౌస్ ఫార్మా కంపెనీ కోసం ఈ సర్జికల్ కాటన్ కొనుగోలు చేశారని, దానివిలువ రూ.36 లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.21 లక్షలు మాత్రమే చెల్లించారని, ఇంకా రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉందని రవీంద్రారెడ్డి వివరించారు. మూడు నెలల క్రితం నరసరావుపేటలో విజయలక్ష్మి నివాసానికి వెళ్లి బకాయిలు చెల్లించాలని కోరగా, ఆమె తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు.