anantha Sriram: నేను రాసిన పాట పాడలేకపోయినందుకు బాలూ గారు బాధపడ్డారు: సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్
- గౌతమ్ మీనన్ నాకు స్వేచ్ఛను ఇస్తారు
- నేను రాసినదే ఆయన ఫైనల్ చేస్తారు
- మరింత బాగా పాడేవాడినని బాలూ గారు అన్నారు
సినీ గేయ రచయితగా తెలుగు పాటపై తనదైన ముద్ర వేసిన అనంత శ్రీరామ్, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాడు. "పాట రాయడంలో నాకు బాగా స్వేచ్ఛను ఇచ్చిన దర్శకులలో గౌతమ్ మీనన్ ముందుంటారు. నేను రాసిన పాటలో ఆయన ఎలాంటి మార్పులు చెప్పేవారు కాదు.
అలా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో 'తాను .. నేను' అనే పాట రాశాను. ఒకసారి 'పాడుతా తీయగా' కార్యక్రమంలో నేను రాసిన పాటలతో ఒక ఎపిసోడ్ చేశారు. అప్పుడు ఈ పాటను గురించి బాలూ గారు స్పందిస్తూ, ఈ పాట పాడే అవకాశం తనకి రానందుకు బాధను వ్యక్తం చేశారు. 'ఈ పాటను నేను పాడి వుంటే ఇంకో 25 శాతం క్వాలిటీ తెచ్చేవాడిని .. మరింత భావగర్భితంగా పాడేవాడిని' అన్నారు. నేను రాసిన పాట గురించి ఆయనలా మాట్లాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చాడు.