Chandrayaan 2: అందమైన చందమామను కెమెరాలో బంధిస్తున్న చంద్రయాన్-2.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
- పలు బిలాలను కెమెరాలో బంధించిన చంద్రయాన్-2
- టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా-2తో చిత్రీకరణ
- 4,375 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు తీసిన వైనం
ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 విజయవంతంగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా చంద్రుడిపై ఉన్న పలు బిలాల చిత్రాలను తన కెమెరాలో బంధించి, గ్రౌండ్ స్టేషన్ కు పంపించింది. చంద్రయాన్-2 పంపిన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విడుదల చేసింది. చంద్రుడిపై ఉన్న సోమర్ ఫెల్డ్, కిర్క్ వుడ్, జాక్సన్, మాక్, కోరోలెవ్, మిత్రా, ప్లాస్కెట్, హెర్మైట్, రోజ్దెస్ట్ వెన్స్కీ బిలాల చిత్రాలను పంపినట్టు ఇస్రో తెలిపింది. ఇవన్నీ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాముల పేర్లు కావడం గమనార్హం.
ప్రొఫెసర్ శిశిర్ కుమార్ మిత్రా పేరు మీద ఓ బిలానికి మిత్రా అని పేరు పెట్టారు. ఐనోస్ఫియర్, రేడియో ఫిజిక్స్ మీద ఆయన చేసిన అధ్యయనాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషన్ పురస్కారంతో సత్కరించింది.
ఈ ఫొటోలను ఆగస్ట్ 23న టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా-2తో 4,375 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయాన్-2 తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 తీసిన తొలి చిత్రాన్ని ఆగస్ట్ 22న ఇస్రో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ల్యాండ్ కానుంది.