Chandrababu: ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా మీకిది కొత్తేంకాదు కదా!: జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్
- ఆశా వర్కర్లకు చంద్రబాబు సంఘీభావం
- ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనంగా ఇవ్వాలంటూ డిమాండ్
- దుర్మార్గపు జీవోను వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్
ఆశా వర్కర్లకు ఏపీ సర్కారు అన్యాయం చేస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామంటూ ఫొటోలకు పోజులిచ్చి, ఇప్పుడు వారిని ఉద్యోగంలోంచి తీసేసే జీవో జారీ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశా వర్కర్ల పనితీరుకు గ్రేడ్ లు ఏంటి? ఒక్కో ఆశా కార్యకర్త ఎలా పనిచేస్తుందో పది మంది తీర్పు ఇవ్వాలా? చిరు ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారు? అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గపు జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ సర్కారును డిమాండ్ చేశారు.
రూ. 10 వేలు వేతనం ఇస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. "ఒకవేళ మీకు ఆ ఉద్దేశం లేకపోతే ఆయుధం సిద్ధంగానే ఉంది కదా, ఆలస్యం ఎందుకు మీ పేటీఎం బ్యాచ్ కి ఒక్క ఫోన్ కొట్టండి. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులంటూ ఏదో ఒక కథ అల్లేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మీకిది కొత్తేం కాదు కదా!" అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.