Krishna River: శ్రీశైలానికి పూర్తిగా నిలిచిన వరద... 400 టీఎంసీలు సముద్రంలోకి!
- పదేళ్ల తరువాత భారీ వరద
- మూడు వారాల్లోనే నిండిపోయిన కృష్ణా జలాశయాలు
- నిన్నటితో ఆగిన వరద ప్రవాహం
దాదాపు పది సంవత్సరాల తరువాత కృష్ణానదికి వచ్చిన భారీ వరద 400 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేసింది. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, తుంగభద్ర వంటి జలాశయాలు గత నెల ప్రారంభానికే పూర్తిగా నిండిపోగా, ఆపై వచ్చిన నీరంతా శ్రీశైలానికి, అక్కడి నుంచి నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లను నింపుతూ, సముద్రుడి ఒడిలోకి చేరిపోయింది. 25 సంవత్సరాల తరువాత కృష్ణా బేసిన్ లోని అన్ని జలాశయాలూ మూడు వారాల వ్యవధిలో నిండిపోవడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు.
ఇక, వర్షాలు తగ్గడంతో ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తిగా నిలిచిపోయింది. జూరాల నుంచి 3 రోజుల క్రితమే నీటిని నిలిపివేయగా, సుంకేసుల నుంచి విడుదల చేస్తున్న నీటిని నిన్న ఆపివేశారు. దీంతో శ్రీశైలానికి ఇన్ ఫ్లో ఆగిపోయింది. ఈ నెల 1 నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం మొదలుకాగా, 12న గరిష్ఠంగా 8.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చింది. మొత్తం మీద 25 రోజుల్లో 785 టీఎంసీల నీరు రాగా, అందులో 202 టీఎంసీల నీరు ప్రస్తుతం సాగర్ లో నిల్వ ఉంది. మిగతా నీటిలో కొంతమొత్తం పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లో ఉంది. ఇక ప్రస్తుతం జలాశయాల నుంచి వివిధ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.