Road Accident: తండ్రి ఆసుపత్రిలో మృత్యుపోరాటం...కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి

  • ఒకే కుటుంబాన్ని చుట్టేసిన విషాదం
  • చనిపోయిన వ్యక్తి యువజన కాంగ్రెస్‌ నేత
  • తండ్రికి సేవలందించే పనిలో ఉండగా ఘటన

విధి చిత్రం అంటే ఇదేనేమో. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుండగా, అతని సపర్యలు చూసే పనిలో ఉన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ కోకాకోలా చౌరస్తాలో రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువజన కాంగ్రెస్‌ నేత ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషాదకర సంఘటన వివరాలు. మియాపూర్‌ పరిధి దీప్తి శ్రీనగర్‌కు చెందిన పి.సాయి శివకాంతారావు (35) వ్యాపారవేత్త. తెలంగాణ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఇతని తండ్రి వెంకటేశ్వరరావు (విశ్రాంత ఏఎస్పీ) అనారోగ్యం బారిన పడడంతో కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వెంకటేశ్వరరావు ఐసీయూలో చికిత్స పొందుతుండగా అతనికి వ్యక్తిగత సహాయకునిగా ఓ వ్యక్తిని ఉంచి తాను అవసరమైన ఇతర పనులు చూస్తున్నాడు.

సహాయకుడిని అతని ఇంటి వద్ద దింపేందుకు అర్ధరాత్రి కారులో బాచుపల్లికి వచ్చి, తిరిగి 1.15 గంటల సమయంలో శివకాంతారావు మియాపూర్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోకాకోలా చౌరస్తావద్ద ఆగివున్న ట్రక్కును గమనించక వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో ఇరుక్కుని శివకాంతారావు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఓవైపు తండ్రి ఆసుపత్రిలో మృత్యు పోరాటం చేస్తుంటే కొడుకు ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులనే కాకుండా, స్థానికంగాను తీవ్ర విషాదాన్ని నింపింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Road Accident
youth congress
one died
Hyderabad
  • Loading...

More Telugu News