Anantapur District: వినాయక చవితి చందా కోసం లారీని అడ్డుకునే యత్నం... ప్రాణాలతో పోరాడుతున్న ముగ్గురు యువకులు!
- అనంతపురం జిల్లాలో ఘటన
- బలవంతంగా చందాలు వసూలు చేస్తున్న యువకులు
- తప్పించుకోబోయి అదుపుతప్పిన లారీ
వినాయక చవితి దగ్గరకు వస్తుందంటేనే చందాల వసూళ్లకు దిగిపోతారు మండపాల నిర్వాహకులు. ఒక్కోసారి చందాల కోసం వీరు హద్దు దాటుతుంటారు కూడా. బలవంతంగానైనా సరే తామడిగిన డబ్బులు ఇవ్వాలని పట్టుబడుతుంటారు. అలా వచ్చిన కొంతమంది యువకులు, రోడ్డుపై తాడు అడ్డుగా కట్టి, చందాలు వసూలు చేస్తున్న వేళ జరిగిన ప్రమాదం వారిని ఆసుపత్రి పాలు చేసి, ప్రాణాల కోసం పోరాడేలా చేసింది.
ఈ ఘటన అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి సమీపంలో జరిగింది. ఈ ప్రాంతంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసిన కొందరు, నిత్యమూ రోడ్డుపై మకాం వేసి, చందాలు వసూలు చేస్తున్నారు. దారిన పోయే వాహనాలను బలవంతంగా ఆపి, డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి, కంబదూరు వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఆపబోయారు. అప్పటికే పలు చోట్ల చందాలు ఇచ్చుకుంటూ వచ్చిన లారీ డ్రైవర్, అసహనంతో లారీని ముందుకు తీసుకెళ్లేందుకు పక్కకు తిప్పడంతో, వాహనం అదుపు తప్పింది. ముగ్గురు యువకులను ఢీకొట్టి, రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో యర్రంపల్లికి చెందిన అరుణ్‌కుమార్, విష్ణు, వసంత్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత కళ్యాణదుర్గం ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.