India: 100 పరుగులకు చాప చుట్టేసిన వెస్టిండీస్... తొలి టెస్టు మనదే!
- ఇప్పటికే టీ-20, వన్డే సిరీస్ లు కైవసం
- తొలి టెస్టులో 419 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచిన టీమిండియా
- 318 పరుగుల ఆధిక్యంతో విజయం
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే, టీ-20 సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు టెస్టు సిరీస్ ను ఘన విజయంతో ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో రహానే సెంచరీకి తోడు మిగతా ప్లేయర్లు కూడా రాణించడంతో, 343/7 వద్ద డిక్లేర్ చేసి, విండీస్ ముందు 419 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత ఆటగాళ్లు, ఆపై బౌలింగ్, ఫీల్డింగ్ లో చెలరేగిపోయారు.
సొంతగడ్డపై బ్యాట్స్ మన్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ ని అంచనా వేయలేకపోయిన విండీస్ ఆటగాళ్లు కేవలం 100 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. వెస్టిండీస్ జట్టుపై భారత్ కు ఇదే అత్యుత్తమ విజయం కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 పరుగులు తీయగా, ఇశాంత్ శర్మ 31 పరుగులిచ్చి 3, షమీ 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.
వెస్టిండీస్ ఆటగాళ్లలో రోస్టన్ చేజ్ (12), కీమర్ రోచ్ (38), మిగెల్ కమిన్స్ (19) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. కాగా, విండీస్ తో రెండో టెస్టు ఈనెల 30 నుంచి కింగ్ స్టన్ లో జరుగుతుంది.