PV Sindhu: టోర్నీలో టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పిన సింధు తల్లి
- ప్రపంచ విజేతగా అవతరించిన పీవీ సింధు
- మురిసిపోయిన కుటుంబ సభ్యులు
- క్వార్టర్ ఫైనల్లో ఓటమి ముంగిట సింధు అద్భుతంగా పుంజుకుందన్న తల్లి
పీవీ సింధు స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమరంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సింధు గెలుపు క్షణాలను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కుటుంబ సభ్యులు టీవీలో వీక్షించారు. ఇప్పటివరకు మరే భారత షట్లర్ కు సాధ్యం కాని రీతిలో సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలవడంతో ఆమె కుటుంబం ఆనందంతో పొంగిపోతోంది. ఫైనల్లో ఒకుహరను వరుస గేముల్లో మట్టికరిపించగానే సింధు ఇంట్లో స్వీట్లు పంచుకున్నారు.
దీనిపై సింధు తల్లి విజయ మాట్లాడుతూ, ప్రతిసారి తన బర్త్ డే సందర్భంగా సింధు ఏదో ఒక కానుక ఇచ్చేదని, ఈసారి తనకు, దేశానికి ఏకంగా ప్రపంచ టైటిల్ నే బహుమతిగా ఇచ్చిందని మురిసిపోయారు. వాస్తవానికి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందని, ఆ క్వార్టర్ ఫైనల్ మ్యాచే సింధు చరిత్ర సృష్టించే క్రమంలో టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహంలేదని విజయ వివరించారు.
ఆ మ్యాచ్ లో మొదటి గేము ఓడిపోయిన సింధు ఆ తర్వాత వరుసగా రెండు గేములు గెలిచి సెమీస్ కు దూసుకెళ్లిందని తెలిపారు. ఒకవేళ క్వార్టర్ ఫైనల్లో మరొక్క గేము ఓడిపోయినా సింధు ఈ ఘనత సాధించగలిగేది కాదని అన్నారు. ఇక సెమీస్, ఫైనల్లో సింధు జోరుకు ఎదురే లేకుండా పోయిందని అన్నారు.