Narendra Modi: ఫలిస్తున్న మోదీ చాణక్యం.. కశ్మీర్ లో పెట్టుబడులకు ఫ్రాన్స్, యూఏఈ రెడీ!
- ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలతో మోదీ మంతనాలు
- అపార అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపు
- యూఏఈ పాలకులతో ప్రత్యేక భేటీ
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రం.. తాజాగా అక్కడ పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించింది. విశాలమైన భూభాగం, అపారమైన సహజవనరులు ఉన్న కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా దేశీయ పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ ప్రభుత్వాలను, అక్కడి కంపెనీలను ప్రోత్సహిస్తోంది.
ప్రస్తుతం జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న మోదీ, భూతల స్వర్గం కశ్మీర్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రాన్స్ పారిశ్రామిక వేత్తలను కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఫ్రెంచ్ పెట్టుబడులకు భారత ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని మోదీ చెప్పారన్నాయి. ఇందుకు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అలాగే నిన్న యూఏఈకి చేరుకున్న మోదీ ఇదే విషయాన్ని ఆ దేశ పాలకుల ముందు ఉంచినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఇందుకు యూఏఈ పాలకులు తమ సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొన్నాయి. భారత్ జీ7 గ్రూపులో సభ్యదేశం కానప్పటికీ, ఫ్రాన్స్ ప్రత్యేక ఆహ్వానం నేపథ్యంలో మోదీ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.