Crime News: అమ్మో...వీరు మామూలోళ్లు కాదు : చిటికెలో కారు కొట్టేస్తారు!

  • పరివర్తన కోసం జైల్లో పెడితే కరడుగట్టిన ముఠాగా మారారు
  • ముగ్గురు పాతనేరస్థులకు మరో ఇద్దరు జత
  • వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్‌

ఒకప్పుడు వారంతా చిల్లర దొంగలు. చిన్నచిన్న చోరీలు చేసి జైలుకు వెళ్లారు. జైలు జీవితంలో పరివర్తన వస్తుందనుకుంటే తమలాంటి వారితో పరిచయం పెట్టుకుని ముఠాగా మారి వరుస దొంగతనాలతో పోలీసులకే సవాల్‌ విసరడం మొదలు పెట్టారు. ఇలా చూస్తే...అలా కార్లు మాయమైపోతుండడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న పోలీసులకు ఎట్టకేలకు వీరు చిక్కారు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌ జిల్లా తాడిగొంబుకు చెందిన పెరియాస్వామి మారిముత్తు (38), కృష్ణాజిల్లా ఘంటసాలకు చెందిన తాతా ప్రసాద్‌ అలియాస్‌ మామిళ్లపల్లి శశిధర్‌ (35), భవానీపురానికి చెందిన నామాల నాగరాజు (27) పాతనేరస్థులు. పెరియాస్వామిపై ఒకటి, తాతా ప్రసాద్‌పై 10, నాగరాజుపై 7 కేసులున్నాయి.

తాతాప్రసాద్‌ ఇళ్లచోరీల్లో దిట్ట. నరసాపురం, గుంటూరు, తెనాలి, తాడేపల్లిగూడెం, నిడదవోలు, చిల్లకల్లు, కైకలూరు పోలీస్‌స్టేషన్లలో ఇతనిపై 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో అరెస్టై జైలుకు వెళ్లాడు.  ఇక భవానీపురానికి చెందిన నామాల నాగరాజు గొలుసునేరాల్లో దిట్ట. ఇతనిపై  మైలవరం, సూర్యారావుపేట, ఇబ్రహీంపట్నం, భవానీపురం పోలీస్‌స్టేషన్లలో ఏడు కేసులున్నాయి. వెర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లిన వీరు అక్కడ   ముఠాగా మారారు. వీరికి బాణావత్‌ సురేష్‌ (28), దొడ్డక గోవర్ధన్‌ (25) జత కలవడంతో వరుసగా వాహనాలను చోరీ చేస్తూ పోలీసులకు సవాలు విసిరారు.

ముందు ద్విచక్రవాహనాలను దొంగిలించి వాటిపైనే కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తారు.  విలువైన కారు కనిపించి ఎవరూ గమనించడంలేదని భావిస్తే దాన్ని దొంగిలిస్తారు. మొత్తం ఐదుగురు కారువద్దకు వెళ్లి మారిముత్తు,తాతా ప్రసాద్‌, నాగరాజులను అక్కడ వదిలి సురేష్‌, గోవర్ధన్‌లు వెళ్లిపోతారు. అనంతరం మిగిలిన ముగ్గురు కారు స్టీరింగ్‌ పక్కన ఉండే అద్దం పగలకొడతారు. తలుపు తెరచి వెంటనే లోపలికి వెళతారు. వైర్లు తెంచి  కారును తీసుకుని పరారవుతారు.

ఇలా భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 3, కృష్ణాజిల్లా చిల్లకల్లు, జగ్గయ్యపేట పీఎస్‌ పరిధిలో ఒక్కోటి చొప్పున, చిత్తూరు జిల్లా, యానాం తదితరాల ప్రాంతాల్లో మొత్తం 10 కార్లు, 3 ద్విచక్రవాహనాలు చోరీ చేశారు. వరుస చోరీలతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు.

విజయవాడలో నేరాలు జరిగిన పలు ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించి అనుమానితుల చిత్రాలను రూపొందించారు. కాలనీల్లో నిఘా ఉంచారు. భవానీపురం మైలురాయి సెంటరులో నిందితులను అనుమానాస్పదంగా సంచరిస్తుండగా నిన్న పట్టుకున్నారు. విచారణలో వాహనాలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేశారు.


  • Loading...

More Telugu News