BJP: వాజ్‌పేయి నుంచి అరుణ్ జైట్లీ వరకు.. ఏడాదిలో గొప్ప నేతలను కోల్పోయిన బీజేపీ

  • ఆగస్టులోనే కన్నుమూసిన వాజ్‌పేయి, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ 
  • ఏడాదిలోనే ఏడుగురు నేతలను కోల్పోయిన బీజేపీ
  • మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌తో మొదలు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ (66) నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కన్నుమూశారు. ఆగస్టు 9 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు జైట్లీ మృతికి సంతాపం తెలిపారు.

భారతీయ జనతాపార్టీ ఒక్క ఏడాదిలోనే స్టాల్‌వార్ట్స్‌గా పేరొందిన పలువురు ప్రముఖులను కోల్పోయింది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, కేంద్రమంత్రి అనంత్ కుమార్ వంటి గొప్ప నేతలను కోల్పోయింది. సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలు 18 రోజుల వ్యవధిలో మృతి చెందారు.

67 ఏళ్ల వయసులో సుష్మాస్వరాజ్ ఈ నెల 6న ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతేడాది ఆగస్టు 16న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 11 జూన్ 2018న ఎయిమ్స్‌లో చేరిన ఆయన ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ ఏడాది మార్చి 17న 63 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్నఆయన గోవా, ముంబై, ఢిల్లీ, న్యూయార్క్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కేంద్ర మాజీ మంత్రి అనంత్‌ కుమార్ గతేడాది నవంబరు 12న బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయసు 59 ఏళ్లు. ఆయన కూడా కేన్సర్‌తో యుద్ధం చేస్తూనే ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా గతేడాది అక్టోబరు 28న ఢిల్లీలో మృతి చెందారు. ఆయన వయసు 83 ఏళ్లు. చెస్ట్ ఇన్ఫెక్షన్‌తోపాటు జ్వరంతో బాధపడుతూ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ ఈ నెల 21న భోపాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 89 ఏళ్ల గౌర్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందారు. ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్, ఎమ్మెల్యే మంగేరామ్ గార్గ్ జులై 21న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.

BJP
Sushma Swaraj
Atal Bihari Vajpayee
Manohar Parrikar
  • Loading...

More Telugu News