Gujarath: గుజరాత్ సముద్ర తీరంలో పాక్ పడవల సంచారం... అప్రమత్తమైన భద్రతా బలగాలు
- కచ్ జిల్లా హరామి నాలా ప్రాంతంలో పాక్ మత్స్యకార పడవలు!
- క్షుణ్ణంగా తనిఖీలు చేసిన భద్రతా బలగాలు
- లోతైన దర్యాప్తు చేయాలని నిర్ణయం
గత కొన్నాళ్లుగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరిహద్దుల వద్ద చీమ చిటుక్కుమన్నా భద్రతా బలగాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా, గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్థాన్ కు చెందిన రెండు పడవలు భారత సరిహద్దు భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేశాయి. గుజరాత్ కచ్ జిల్లా హరామి నాలా ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆ మత్స్యకార పడవలను వెంటనే ఆపేసిన భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఆ పడవల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోయినా, లోతైన దర్యాప్తు నిర్వహించాలని భద్రతా బలగాలు నిర్ణయించాయి. ఇటీవల ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించేందుకు సముద్ర మార్గాలను ఆశ్రయిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పడవలు భారత తీరంలో ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది.