India: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ‘ఆర్డర్ ఆఫ్ జయాద్’ను బహూకరించిన యూఏఈ ప్రభుత్వం!
- అందించిన యువరాజు జయాద్ అల్ నహ్యాన్
- పలు అంశాలపై చర్చలు జరపనున్న మోదీ-నహ్యాన్
- గతంలో పుతిన్, జిన్ పింగ్ లకూ అవార్డు బహూకరణ
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయాద్’తో సత్కరించింది. యూఏఈ యువరాజు జయాద్ అల్ నహ్యాన్ ఈ అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. యూఏఈ ప్రభుత్వం గతంలో చాలామంది దేశాధినేతలకు ఈ అవార్డును బహూకరించింది.
2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్, 2010లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, 2016లో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, 2018లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లకు ఈ అవార్డును యూఏఈ సర్కారు అందించింది. యూఏఈ పర్యటనలో భాగంగా యువరాజు జయాద్ అల్ నహ్యాన్ తో భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై చర్చలు జరపనున్నారు.