Arun Jaitly: వ్యక్తిగత సిబ్బందితో జైట్లీకి విడదీయరాని బంధం!
- వ్యక్తిగత సిబ్బందిని సొంతవారిలా చూసుకున్న జైట్లీ
- వారి పిల్లల వివాహాలకు తన ఇంటిని వేదికగా మార్చిన నేత
- జైట్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేసిన సిబ్బంది పిల్లలు
అరుణ్ జైట్లీ... భారత్ లో అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. ఆర్థిక చట్టాలు అన్నింటినీ ఔపోసన పట్టిన జ్ఞాని. ఆర్థికమంత్రిగా దేశ వ్యవస్థపై తనదైన ముద్ర వేసిన ఆయన పార్టీలకు అతీతంగా మంచిపేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో మకిలి అంటించుకోకుండా బయటపడిన అతికొద్ది మంది నేతల్లో జైట్లీ ఒకరు. ఇప్పుడాయన ఈ లోకాన్ని వదిలివెళ్లిన తరుణంలో ఆయన జ్ఞాపకాలు అపురూపం అయ్యాయి.
జైట్లీ జీవితాన్ని తరచి చూస్తే క్షణం తీరికలేకుండా, తన వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవడానికి కూడా సమయంలేని వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఢిల్లీలో పెద్ద పెద్ద కేసులు వాదించిన ఆయన తన వద్దకు వచ్చే ప్రతి కేసులోనూ సిబ్బందికి ఎంత మొత్తం దక్కాలో అంతా నేరుగా వారికే అందేలా చూసేవారు.
జైట్లీ వద్ద పనిలో చేరారంటే ఓ ప్రభుత్వ వ్యవస్థలో చేరినట్టే! ఎందుకంటే, తన వద్ద పనిచేసే వారి సంక్షేమాన్నే కాకుండా వారి పిల్లల బాగోగులు కూడా జైట్లీనే స్వీకరించేవారు. వాళ్ల వివాహాలకు తన ఇంటిని వేదికగా మార్చేవారు. ఆయన పట్ల సిబ్బంది కూడా అత్యంత విశ్వాసం చూపించడం అనేక సందర్భాల్లో కనిపించింది.
జైట్లీ అమృత్ సర్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారని తెలియగానే, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర రంగాలకు చెందినవాళ్లు స్వచ్ఛందంగా అమృత్ సర్ లో వాలిపోయారు. వారిలో సిబ్బంది పిల్లలు, ఆయన ద్వారా సాయం పొందిన వాళ్లు ఉన్నారు. జైట్లీని గెలిపించడం కోసం వారు రేయింబవళ్లు శ్రమించారు. తమ వృత్తిలో ఉన్నత స్థానంలో వున్న వాళ్లు సాధారణ కార్యకర్తల్లా ఇల్లిల్లూ తిరిగి జైట్లీ విజయం కోసం శ్రమించారు.
జైట్లీ కోసం వారు తమ వృత్తిని, ఇంటిని తాత్కాలికంగా వదిలిపెట్టి వచ్చారంటే ఆయన వారిని ఎంత ప్రేమగా చూసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అమృత్ సర్ లో పదులకొద్దీ ఇళ్లు జైట్లీ కోసం పార్టీ కార్యాలయాల్లా మారిపోయాయి. వారంతా జైట్లీ కోసం తమకు తాముగా కార్యకర్తల అవతారం ఎత్తారు. తాను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎదగాలన్న మంచి మనస్తత్వానికి ప్రతిఫలమే ఇదంతా! జైట్లీ తన జీవితంలో సాధించిన అత్యంత ఘనత ఇదే!