Andhra Pradesh: అరుణ్ జైట్లీ కోలుకుంటారని ఆశించాం.. కానీ!: చంద్రబాబు

  • అరుణ్ జైట్లీ మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
  • జైట్లీ చిరస్మరణీయ సేవలు అందించారని కితాబు
  • న్యాయ, ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేశారని వ్యాఖ్య

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో జైట్లీ మరణంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా జైట్లీ అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు తెలిపారు. ఆయన కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో అందరికీ దూరం కావడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

‘వాజ్ పేయి, నరేంద్రమోదీ మంత్రివర్గాల్లో న్యాయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల కోసం జైట్లీ కృషి చేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన జైట్లీ, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రముఖ న్యాయకోవిదుడిగానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడిగా పేరొందారు. ఆయన మృతి బీజేపీకే కాకుండా మొత్తం దేశానికే తీరనిలోటు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Arun Jaitly
dead
condolenses
BJP
  • Loading...

More Telugu News