Telangana: మొక్కలు తినేశాయట.. మేకలకు రూ.500 జరిమానా విధించిన అధికారులు!
- తెలంగాణలోని వికారాబాద్ లో ఘటన
- హరితహారం మొక్కను తినేసిన మేకలు
- జరిమానా విధించిన పంచాయతీ కార్యదర్శి
సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించినప్పుడు, లేకపోతే ఏవైనా బిల్లులను గడువులోగా చెల్లించనప్పుడు అధికారులు జరిమానాలు విధిస్తుంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలో మేకల గుంపునకు అధికారులు రూ.500 జరిమానా విధించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ఇటీవల హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలను నాటారు. అయితే కొన్ని మేకలు ఈ మొక్కల్లో ఒకదాన్ని తినేశాయి. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి మేకలపై రూ.500 జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని మేకల యజమానిని ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.