Crime News: చోరీ కేసు విచారిస్తే 20 ఏళ్లనాటి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది!

  • నాలుగేళ్ల వయసులో మాయమైన చిన్నారి
  • ఇరవై నాలుగేళ్ల ఏళ్ల అనంతరం ఆచూకీ లభ్యం
  • ఓ కి‘లేడీ’ నేర చిట్టావిని నోరెళ్లబెడుతున్న పోలీసులు

‘వెతక బోయే తీగ కాలికి తగడం’ అంటే ఇదేనేమో. చోరీ కేసులో చిక్కిన ఓ కి‘లేడీ’ని విచారిస్తున్న పోలీసులకు ఇరవై ఏళ్ల క్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించడంతో అవాక్కయ్యారు. దాదాపు మూడేళ్లపాటు పిల్లాడి కోసం అవిశ్రాంతంగా గాలించిన కానిస్టేబుల్‌ విచారణలోనే ఈ విషయం బయటపడడం మరో విశేషం. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ప్రాంతానికి చెందిన సుంకరి భాగ్యలక్ష్మి రెండున్నర దశాబ్దాలుగా దొంగతనాలే వృత్తిగా జీవిస్తోంది. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో కలిసి ఉంటోంది. వీలుచిక్కినప్పుడల్లా దొంగతనాలు, చోరీలకు పాల్పడుతోంది.

ఇటీవల విజయనగరం జిల్లా జియ్యమ్మవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చిన సందర్భంలో భాగ్యలక్ష్మికి అతనితో పరిచయం అయ్యింది. దీంతో అతని ఇంటికి వెళ్లింది. ఈ నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యాపారికి చెందిన బంగారు ఆభరణాలు అపహరించి వుడాయించింది. దీంతో కంగుతిన్న వ్యాపారి విషయం గ్రామస్థులకు తెలిపాడు. దీంతో అలర్టయిన  గ్రామస్థులు ఆమె బస్సులో ఉందని తెలుసుకుని పట్టుకుని జియ్యమ్మవలస పోలీసులకు అప్పగించారు.

ఇరవై ఏళ్ల క్రితం చీపురుపల్లి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన లోపింటి రామకృష్ణ ప్రస్తుతం జియ్యమ్మవలస స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను భాగ్యలక్ష్మిని విచారించగా ఇరవై ఏళ్లక్రితం ఓ బాలుడిని అపహరించి అమ్మేశానని, అతనిప్పుడు పెద్దవాడై  ప్రేమ వివాహం చేసుకుని రాజమండ్రిలో స్థిరపడ్డాడని తెలపడంతో కంగుతిన్నాడు. ఎందుకంటే  అప్పట్లో బాలుడి కేసు విచారణలో భాగంగా అతని ఆచూకీ కోసం రామకృష్ణ మూడేళ్లపాటు అవిశ్రాంతంగా తిరిగాడు.

20 ఏళ్ల క్రితం భాగ్యలక్ష్మి చీపురుపల్లి మండలం వంగపల్లిపేటలో సూర్యారావు, పెంటమ్మ దంపతుల  పక్కింట్లో అద్దెకు ఉండేది. ఓ రోజు ఎవరూ గమనించడం లేదని భావించిన ఆమె  సూర్యారావు ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో నిద్రిస్తున్న నాలుగేళ్ల  వారి కొడుకు శంకరరావుతో పాటు, 25 తులాల బంగారు ఆభరణాలు, చీరలు, డబ్బులు ఎత్తుకుపోయింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది.

భాగ్యలక్ష్మి అందరితో కలుపుగోలుగా ఉండటంతో ఆమెపై అప్పట్లో ఎవరికీ అనుమానం రాలేదు. ఆ  భాగ్యలక్ష్మే తాజా కేసులో రామకృష్ణకు చిక్కడంతో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. చీపురుపల్లిలో దొంగతనం, బాబు అపహరణ తానే చేశానని నిందితురాలు ఒప్పుకొంది. కాగా, ఎప్పుడో మాయమైన తన అన్న శంకరరావు బతికే ఉన్నాడని తెలిసిన అతని సోదరి జ్యోతి ఫోన్లో అతనితో మాట్లాడి సంతోషాన్ని పంచుకుంది.

Crime News
Vijayanagaram District
jiyyammavalasa
kiladi lady
  • Loading...

More Telugu News