Andhra Pradesh: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.78 లక్షలు వసూలు.. తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదికి సంకెళ్లు!

  • కేసు నమోదుతో తప్పించుకు తిరుగుతున్న న్యాయవాది
  • స్థిరాస్తి వ్యాపారి అవతారం ఎత్తిన పోలీసులు
  • విజయవాడలో చిక్కిన నిందితుడు

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.78 లక్షలు కాజేసిన న్యాయవాదికి పోలీసులు బేడీలు వేశారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో పనిచేస్తున్న తంగెడ వెంకట శివనాగ సుబ్రహ్మణ్య వరప్రసాద్‌కు రెండేళ్ల క్రితం హైదరాబాద్, హిమాయత్‌నగర్‌కు చెందిన కోటగిరి రామారావు పరిచయమయ్యాడు. ఈ సందర్భంగా తనకు ప్రముఖులు బాగా తెలుసని చెప్పాడు. దీంతో తన ఇద్దరు కుమారులకు ఉద్యోగం ఇప్పించాలని వరప్రసాద్‌ను రామారావు కోరాడు.

దీనిని ఆసరాగా తీసుకున్న వరప్రసాద్ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్ఎస్‌సీ) లో తనకు తెలిసినవారున్నారని, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికాడు. ఆరు నెలల వ్యవధిలో రూ.78 లక్షలు వసూలు చేశాడు. అయితే, ఎస్ఎస్‌సీ ఫలితాల్లో తమ కుమారుల పేర్లు లేకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని రామారావు ఒత్తిడి తీసుకొచ్చాడు. అతడు తాత్సారం చేయడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరప్రసాద్ కోసం రంగంలోకి దిగారు. విషయం తెలిసిన వరప్రసాద్ ఫోన్ నంబర్లు మారుస్తూ ఏపీ, తెలంగాణలో తిరగసాగాడు. దీంతో పోలీసులు స్థిరాస్తి వ్యాపారుల్లా మారి అతడి నంబరు తెలుసుకుని కాల్ చేశారు. పోలీసుల ఉచ్చులో పడిన నిందితుడు తాను విజయవాడలో ఉన్నానని, వచ్చి కలవాలని సూచించాడు. అతడు చెప్పిన హోటల్‌కు వెళ్లిన పోలీసులు అక్కడ అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.  

Andhra Pradesh
Telangana
High Court
lawyer
  • Loading...

More Telugu News