Andhra Pradesh: అప్పుడేమో ఫీజులు కడతామన్నారు.. ఇప్పుడేమో కొడుతున్నారు!: జగన్ పై లోకేశ్ విమర్శలు
- విజయనగరంలో విద్యార్థులపై లాఠీచార్జ్ పై లోకేశ్ ఫైర్
- విద్యార్థులను లాఠీలతో చావబాదుతారా?
- రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తీర్చండి
నిన్న విజయనగరంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నారా లోకేశ్ స్పందిస్తూ, ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ‘మీరు చదువుకోండి ఫీజులు మేము 'కడతాం' అని ప్రచారం చేసుకున్న జగన్, ఇప్పుడు ఫీజులు అడిగితే 'కొడతాం' అంటున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించమంటూ మూడు గంటలు మండుటెండలో నిరసన చేసినా విద్యార్థుల సమస్యలు వినే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను లాఠీలతో చావబాదుతారా? గిరిజన సంక్షేమగృహాల్లో వసతులు పెంచమని కోరడమే తప్పా? ప్రభుత్వానికి గిరిజన సంక్షేమం మీద ఉన్న శ్రద్ధ ఇదేనా? మాటలు చెప్పడం కాదు, చేసి చూపండి. వెంటనే రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు తీర్చండి’ అని జగన్ ని డిమాండ్ చేశారు.