Tirumala: అన్యమతం ప్రచారం టికెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించినట్టు తేలింది: మంత్రి వెల్లంపల్లి

  • ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం
  • అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ టెండర్లను కట్టబెట్టింది
  • నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు  తిరుపతి డిపోకు వెళ్లాయి

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ఉదంతంపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణకు ఆదేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ టికెట్లు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు ఆ టెండర్లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టుగా తెలుస్తోందని అన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేయడమే కాదు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు చెప్పారు.

ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం, దానికి సంబంధించిన వ్యక్తులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని విమర్శించారు. కొన్ని టీవీ ఛానళ్లు, కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారాన్ని మరింతగా ప్రచారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ దురుద్దేశపూర్వక ప్రచారం ద్వారా తిరుమల శ్రీవారి భక్తుల మనసులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, తిరుమల ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టప్రకారం నడుచుకుంటామని హెచ్చరించారు.

40 దేవాలయాలను కూలగొట్టించింది, సదావర్తి భూములు కాజేసింది, కనకదుర్గమ్మ గుడిలో, కాళహస్తిలో క్షుద్ర పూజలు చేయించింది, అమ్మవారి భూములను తన వారికి లీజులకు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆరోపించారు. హిందూత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా? అని ప్రశ్నించారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు అన్ని దుర్మార్గాలూ చేశారు కనుకనే, ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News