Modi: మోదీని ప్రశంసలతో ముంచెత్తిన కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వి, జైరాం రమేశ్
- మోదీని దోషిగా నిలబెట్టాలనుకోవడం సరికాదన్న సింఘ్వీ
- ఆయన సాధించిన విజయాల గురించి కూడా మాట్లాడాలని సూచన
- మోదీ విలక్షణతను గుర్తించకపోతే ఆయనను ఎదుర్కోవడం కష్టమన్న జైరాం రమేశ్
ప్రధాని మోదీ నిర్ణయాలను సమర్థిస్తున్న కాంగ్రెస్ నేతల సంఖ్య పెరుగుతోంది. నిన్ననే మోదీకి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ స్పందించారు. తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, ప్రధాని మోదీని దోషిగా నిలబెట్టాలనుకోవడం సరికాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు మంచిగానో, చెడుగానో, మరో విధంగానో ఉంటాయని చెప్పారు. కేవలం ఒక విషయం ఆధారంగానో లేక సమస్య ఆధారంగానో జడ్జిమెంట్ ఇవ్వాలని... ఒక వ్యక్తి కోణంలో అభిప్రాయాన్ని వెలువరించరాదని అన్నారు. ఏకపక్షంగా విమర్శిస్తూ పోతే... చివరకు అది మోదీకే లాభిస్తుందని స్పష్టం చేశారు. మోదీ సాధించిన విజయాల గురించి, ఆయనకు సంబంధించిన పాజిటివ్ అంశాల గురించి కూడా మాట్లాడాలని... లేకపోతే విపక్షాలకే నష్టమని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు మోదీని ప్రశంసిస్తూ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
నిన్న జైరాం రమేశ్ మాట్లాడుతూ, 2014-19 మధ్య కాలంలో మోదీ ఏం చేశారనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన చేసిన పనుల వల్లే భారీ మెజార్టీతో రెండో సారి అధికారంలోకి వచ్చారని చెప్పారు. జనాల హృదయాలలోకి వెళ్లే భాషను మోదీ మాట్లాడతారని అన్నారు. గతంలో ఎవరూ చేయలేని పనులను చేస్తున్నారని, ప్రజలు గుర్తుంచుకునే పనులను చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతే... ఆయనను ఎదుర్కోవడం కష్టమని స్పష్టం చేశారు. మోదీని పొగడాలని తాను చెప్పడం లేదని... అయితే పాలనలో ఆయన విలక్షణతను గుర్తించాలని రాజకీయవేత్తలకు సూచిస్తున్నానని అన్నారు.
జాతీయ రాజకీయాలలో 2009లో మోదీ పేరు తొలిసారి వినిపించినప్పుడు... ఆయన వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలుపొందుతారని ఎవరూ ఊహించలేదని జైరాం రమేశ్ చెప్పారు. మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు) పథకాన్ని అందరూ లైట్ గా తీసుకున్నారని... కానీ ఆ పథకం కోట్లాది మహిళలకు మోదీని చేరువ చేసిందనే విషయం పలు ఎన్నికల అధ్యయనాల్లో తేలిందని తెలిపారు. రైతు సమస్యలపై మనం ఎంతో ప్రచారం చేశామని... రైతుల బాధలను ప్రజలంతా గుర్తించారని... అయితే, దానికి మోదీ మాత్రమే కారణమని వారు భావించలేదని చెప్పారు. రైతు సమస్యలపై మనం ఇంత ప్రచారం చేసినా... చివరకు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. మోదీ అత్యంత గౌరవనీయ నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పారు.