Imran Khan: ఇరు దేశాల మధ్య రోజురోజుకూ యుద్ధ వాతావరణం పెరుగుతోంది: ఇమ్రాన్ ఖాన్
- ఆర్టికల్ 370పై తాడోపేడో తేల్చుకుంటాం
- చర్చలకు ఆహ్వానించిన ప్రతిసారి మా సైన్యాన్ని దెబ్బతీస్తున్నారు
- ఇలాంటి పరిస్థితుల్లో నేను చేయగలింది ఏమీ లేదు
భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు తాను చాలా సార్లు యత్నించానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే, ప్రతిసారి తమ చర్యలను భారత్ కేవలం బుజ్జగింపుల మాదిరిగానే భావిస్తోందని... ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకు మించి తాము చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. ఇరు దేశాల మధ్య రోజురోజుకూ యుద్ధ వాతావరణం పెరుగుతోందని... ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దుపై ఇండియాతో తాడోపేడో తేల్చుకుంటామని... అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు, ఐక్యరాజ్యసమితిలో బలమైన వాదనను వినిపిస్తామని తెలిపారు. విదేశీ మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత ప్రధాని మోదీని చర్చలకు ఆహ్వానించిన ప్రతిసారి... తమ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు.