Guntur District: గుంటూరులో కోన వెంకట్ ఫిల్మ్ స్టూడియో: పర్యాటక శాఖ సమన్వయంతో ఏర్పాటు యోచన!
- సినీ రచయిత కోన వెంకట్ ఆధ్వర్యంలో రూ.500 కోట్లతో నిర్మాణం
- నవ్యాంధ్రలో విశాఖ రామానాయుడు స్టూడియో ఒక్కటే
- పరిశ్రమ అంతా హైదరాబాద్‌కే పరిమితం
గుంటూరులో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో జిల్లాలో స్టూడియో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. గుంటూరు జిల్లా సూర్యలంకలో స్టూడియో ఏర్పాటు చేయాలని భావిస్తున్న కోన వెంకట్ ఇందుకోసం పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ పర్యాటక శాఖ సమన్వయంతో ఈ స్టూడియో ఏర్పాటుకానున్నదని సమాచారం. హాలీవుడ్‌లోని డిస్నీ థీమ్ పార్క్ తరహాలో దీన్ని ఏర్పాటు చేస్తారట.
ఒకప్పుడు సినీ పరిశ్రమ పేరు చెబితే మద్రాస్ పేరు వినిపించేది. అప్పటి సినీ పెద్దల కృషి ఫలితంగా రెండున్నర దశాబ్దాల క్రితం చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలివచ్చింది. అన్నపూర్ణ, రామానాయుడు, పద్మాలయ, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి నూతన స్టూడియోలు ఏర్పాటయ్యాయి.
రాష్ట్ర విభజనకు ముందు విశాఖలోని బీచ్ రోడ్డులో మంగమూరిపేట సమీపంలోని కొండపై రామానాయుడు స్టూడియో ఏర్పాటయ్యింది. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖు విశాఖలో స్టూడియోల ఏర్పాటుకు స్థల సేకరణ జరిపినట్టు వార్తలు వచ్చినా అవి ముందుకు వెళ్లలేదు. అనుబంధ రంగాల సదుపాయం అంతంతమాత్రం కావడంతో విశాఖలోని రామానాయుడు స్టూడియోకు ఆదరణ అంతంతే అయ్యింది.
ఈ కారణంగానే సినీ పెద్దలు ముందడుగు వేయలేదని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖలోని రామానాయుడు స్టూడియో తప్ప మరో పేరు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో గుంటూరులో స్టూడియో ఏర్పాటు వార్తలతో చిత్రపరిశ్రమకు జీవం వస్తుందన్న మాట వినిపిస్తోంది.