Chidambaram: వారిద్దరినీ నేనెప్పుడూ కలవలేదు: కార్తీ చిదంబరం
- కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను నా తండ్రి ఎత్తిచూపుతున్నారు
- ఆయన నోరు మూయించడానికే అరెస్ట్ చేయించారు
- పీటర్, ఇంద్రాణి ముఖర్జియాలను నేనెప్పుడూ కలవలేదు
కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న తన తండ్రి నోరు మూయించడానికే ఆయనను అరెస్ట్ చేయించారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మండిపడ్డారు. ఇప్పటి వరకు తనకు 20 సార్లు సమన్లు జారీ చేశారని, నాలుగు సార్లు రెయిడ్ చేశారని... అయినా, ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని అన్నారు.
పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియాలను తాను ఎన్నడూ వ్యక్తిగతంగా కలవలేదని, వారితో కలసి పని చేయలేదని చెప్పారు. సీబీఐ కేసు విచారణ సందర్భంగా గతంలో ఒక సారి ఇంద్రాణిని కలిశానని తెలిపారు. ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)లో ఉన్న ఎవరినీ తాను కలవలేదని, ఎఫ్ఐపీబీ ప్రాసెస్ ఏమిటో కూడా తనకు తెలియదని అన్నారు.
చిదంబరంను అరెస్ట్ చేయడం వెనుక ఎవరి హస్తం ఉండవచ్చని భావిస్తున్నారనే మీడియా ప్రశ్నకు సమాధానంగా, 'బీజేపీనే ఇందతా చేయిస్తోంది. బీజేపీ కాకపోతే మరెవరు చేస్తారు? డొనాల్డ్ ట్రంప్ చేయించారని మీరు అనుకుంటున్నారా?' అని ఎదురు ప్రశ్న వేశారు. మరోవైపు, తన తండ్రిని కలిసేందుకు కార్తీకి సీబీఐ అధికారులు అనుమతి నిరాకరించారు.