Sister: అక్క రావడం లేదని.. చెల్లెలితో పాఠాలు చెప్పించిన కాలేజ్!

  • మెటర్నిటీ లీవులో అక్క
  • ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం
  • విచారణకు ఆదేశించిన డీఈఓ

మెటర్నిటీ లీవులో ఉన్న అధ్యాపకురాలికి బదులు ఆమె చెల్లెలితో పాఠాలు చెప్పించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ, మెటర్నిటీ లీవులో ఉండగా, ఆమె చెల్లెలు మాణిక్య కుమారిని పాఠాలు బోధించడానికి ప్రిన్సిపాల్ రవీందర్ నియమించారు. గత నెల 22న గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం రెన్యువల్ చేయగా, రెండు రోజులు మాత్రమే డ్యూటీ చేసిన విజయ, ఆపై సెలవుపై వెళ్లినట్టు తెలుస్తోంది.

దీంతో అప్పటి నుంచి మాణిక్య కుమారి, అక్క స్థానంలో ఆమె విధులకు హాజరవుతూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ విషయం బుధవారం నాడు విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో వారు నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్‌ రవీంద్రను నిలదీశారు. డీఈవో ఇంద్రాణి అనుమతితోనే ఈ నియామకం జరిగినట్టు మొదట తెలిపిన ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. డీఈవో వివరణ కోరగా, దీనిపై విచారణకు ఆదేశించామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News