Haryana: అశ్లీల నృత్యాలతో హోరెత్తిన బీజేపీ ఆశీర్వాద యాత్ర
- బీజేపీ యాత్రపై తీవ్ర విమర్శలు
- వారు మహిళలు కాదన్న ఎమ్మెల్యే
- సభకు హాజరైన వారికి వినోదం కోసమేనన్న సర్పంచ్
హరియాణాలోని థానేసర్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన జన ఆశీర్వాద యాత్ర అశ్లీల నృత్యాలతో హోరెత్తింది. యాత్ర హతీరా గ్రామానికి చేరుకున్నాక బీజేపీ నేతలు సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. సీఎం రాకకు ఇంకా సమయం ఉండడంతో స్టేజిపైకి చేరుకున్న మహిళా డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలతో సభను హీటెక్కించారు. డ్యాన్సులు చూసిన యువత ఉర్రూతలూగిపోయింది. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశీర్వాదం యాత్రల పేరుతో అసభ్య నృత్యాలు ఏంటంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి హాజరు కావాల్సిన సభలో ఈ నృత్యాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
విమర్శలపై బీజేపీ నేతలు స్పందించారు. ఆ సభను ఏర్పాటు చేసింది తాము కాదని, గ్రామ సర్పంచ్ అని థానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధ పేర్కొన్నారు. స్టేజిపై డ్యాన్స్ చేసింది కూడా మహిళలు కాదని, ట్రాన్స్ జెండర్లని వివరణ ఇచ్చారు. సభకు హాజరైన ప్రజలకు వినోదాన్ని పంచేందుకు తానే ఈ ఏర్పాట్లు చేశానని సర్పంచ్ సునీల్ మెహ్రా తెలిపారు. ముఖ్యమంత్రి రాక ఆలస్యమవుతుందని తెలియడంతో జనాన్ని ఎంటర్‌టైన్ చేసేందుకు తానే ఈ నృత్యాలు ఏర్పాటు చేయించానని, వారు రెండుమూడు గంటలపాటు సంప్రదాయ నృత్యాలు చేశారని చెప్పుకొచ్చారు.